ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణకు మూలస్తంభం న్యాయవ్యవస్థ

* లక్ష్మీపురం వరంగల్ తూర్పు నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పోలెపాక చంద్రకళ

* వారి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి

వరంగల్: ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణకు మూలస్తంభం న్యాయవ్యవస్థ అని లక్ష్మీపురం వరంగల్ తూర్పు నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి  పోలెపాక చంద్రకళ అన్నారు. నేటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 'ధర్మఘంట'తో ఆమె మాట్లాడుతూ...  రాజ్యాంగ దినోత్సవ వివరాలు చర్చించారు.

'లా’వొక్కింతయులేదు, ధైర్యంబు విలోలంబయ్యె, ప్రాణంబులున్‌ ఠావుల్‌ దప్పెను, మూర్చవచ్చె, తనువున్‌ డస్సెన్‌, శ్రమం బయ్యెడిన్‌’…అన్న పోతనామా త్యుడి గజేంద్ర విలాపమును గుర్తుకు తెస్తున్నది నేటి జాతీయ ‘లా’ దినోత్సవం. ఎందుకంటే, ఒక్కింత న్యాయం చేయండీ అని ఎన్ని గొంతులు ఈ దేశంలో అర్థిస్తున్నాయో వింటే, మొసలికి చిక్కిన గజేంద్రుడి దు:ఖం గుర్తుకు రాక మానదు. పురాణగాధలో గజేంద్రుని ఘోషను వైకుంఠపురంలో వున్న విష్ణుమూర్తి విని హుటాహుటిన కాపాడేందుకు ఉరికొచ్చాడు. మరి వాస్తవిక వర్తమానంలో మన కున్న ఏకైక భరోసా మన రాజ్యాంగం. దాని ప్రకారంగానే న్యాయం కావాలని ఎవ రమైనా అడుగుతాము. న్యాయమైనా, చట్టమైనా ఏదయినా ఆచరణలోకి రావటా నికి, రాజ్యము నిర్వహించే పాత్ర కీలకమైనదన్నారు. 

వాస్తవానికి మనమే ఏర్పాటు చేసు కున్న రాజ్యాంగం ప్రకారమే పాలనయినా, న్యాయమైనా జరగవలసి వుంటుంది. కానీ న్యాయమూ, చట్టమూ, పాలనా సమాజంలోని ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నపుడు అశేష సామాన్యులంతా అన్యాయం పాల వుతూనే వుంటారు. ఆర్తగీతాలాపన కొనసాగుతూనే వుంటుంది. అసలు చట్టము న్యాయ విధాన వ్యవస్తా ఏర్పడిందే వారి కోసం కదా! అదొక మౌలిక విషయం. దాన్నలా వుంచి న్యాయ దినోత్సవాన్ని గురించి మాట్లాడుకోవాలన్నారు.

జనవరి 26, 1946లో మన రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకున్నం. నవంబరు 26, 1949న, డా|| అంబేద్కర్‌ ఆధ్వర్యంలో రచించ బడిన రాజ్యాంగాన్ని ఆమోదించి స్వీకరించడం జరిగింది. 26, జన వరి 1950లో అమలు ప్రారంభమయింది. రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబరు 26ను ముప్పయి ఏండ్ల తర్వాత సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ న్యాయదినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. 2015లో డా|| అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా కూడా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఈ సందర్భంగా రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మననం చేసుకోవాలని, అదే విధంగా రాజ్యాంగ నిర్మాతగా వున్న అంబేద్కర్‌ను ఆయన ఆశయాలను స్మరించుకోవాలన్నది ఈ దినోత్సవాల లక్ష్యం.

ప్రజాస్వామ్య పరిరక్షణ, మానవ హక్కులకు రక్షణ, శాంతి, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, లౌకిక విలువలను పరిరక్షించడం మొదలైన సూత్రాలు రాజ్యాంగసారంగా వున్నాయి. ఈ సూత్రాల ఆధారంగానే న్యాయ వ్యవస్థ చట్టము పనిచేస్తాయి. న్యాయవ్యవస్థ అనేది ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణకు మూలస్తంభం లాంటిది. రాజ్యంగం ప్రజలకు కల్పించిన ఈ హక్కులన్నీ, విలువలన్నీ ఇపుడు వమ్ము చేయబడుతున్నాయి. ఏ నేరమూ చేయని వేలాది మంది ప్రజలు, హక్కుల కార్యకర్తలు నిర్భంధానికి గురయివున్నారు. మానవ హక్కులు హరించబడుతున్నాయి. లౌకిక విలువలు మంటకలిశాయి. బహిరంగంగానే మత విద్వేషాలను రెచ్చగొడుతూ విధ్వంసాలు సృష్టిస్తు న్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ హరించుకుపోతోంది. బ్రతికే హక్కు, మాట్లాడే హక్కు, ఇష్టమైన తిండి తినే స్వేచ్ఛ, బట్టకట్టుకునే స్వేచ్ఛ అన్నీ నియంత్రిం చబడుతున్నాయి. ముఖ్యంగా రాజ్యాంగం కల్పించిన ఆదివాసీల, దళితుల, స్త్రీల, మైనారిటీల, జాతుల, తెగల హక్కులు నిరాకరణకు గురవుతున్నాయి. సామాన్యులకు చట్టం, న్యాయం అందని ద్రాక్షగానే వున్నది. అంబేద్కరు మహాశయుడు పాటుపడిన సామాజిక న్యాయానికి తూట్లు పడుతున్నవి. కుల నిర్మూలన అటుంచి కుల వివక్షతలు పెరిగి మనుధర్మ అధర్మ పాలనకై పయనం సాగుతున్నది.

ఇన్ని రాజ్యాంగ హక్కులను నిరాకరించబడుతున్న వేళ రాజ్యాంగ దినోత్సవం జరుపు కొంటున్నాం. ఎన్నెన్నో అన్యాయాలు వెంటాడుతున్న వేళ న్యాయదినో త్సవాన్ని చేస్తున్నాము. అవునుమరి లేని వాటిని పొందాలన్న కోరికతోనే ఈ దినో త్సవాలు జరుపుకోవటం. ప్రపంచంలోనే గొప్పదనదగిన అతి పెద్ద లిఖిత రాజ్యాం గం మనకున్నప్పటికీ, దాని ప్రకారం అందరికీ సమాన న్యాయం హక్కులు అందక పోవటం పాలకుల దుర్నీతికి, దుర్వర్తనకు అద్దం పడుతుంది. నిజంగా బాబా సాహెబ్‌తో పాటుగా అనేక మంది విద్యాధికులు, నాయకులు ఎంతో కృషి చేసి, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, శాంతి, సౌహార్థతల సారంగా ఒక ఘనమైన రాజ్యాంగాన్ని మనకందించారు. కానీ అందులోని అన్ని విలువలు, హక్కులు త్రోసివేయబడుతున్నాయి. ఇలా తోసివేస్తున్న పాలకులే మరోవైపు ఉత్సవాలను ఘనంగా చేయాలని పిలుపునియ్యటం విడ్డూరమైన విషయం. రాజ్యాంగపు మూలసూత్రమైన ప్రజాస్వామ్యం పూర్తిగా ధనస్వామ్యంగా మారి పోవటం ఎన్నికలలో మనం చూస్తున్నాము. ఎన్నికలే కాదు, ప్రభుత్వాల ఏర్పాటులో, పార్టీల ఫిరాయింపుల్లో, పదవుల పందేరంలో స్పష్టంగా కనబడుతున్నది.

ఇట్లాంటి సందర్భంలో రాజ్యాంగాన్ని, దాని స్పూర్తిని కాపాడుకునేందుకు కృషి చేయటమే నిజమైన కర్తవ్యంగా భావించాలి. న్యాయ సమానత్వాలు అందరికీ అందేందుకు చైతన్యయుత పోరాటమే ఏకైక మార్గంమని, అందుకు ప్రజలను సన్నద్ధులను చేయటమే దినోత్సవాల అర్థం పరమార్థం కావాలన్నారు. న్యాయవాదినైన తాను న్యాయ సమానత్వాలు అందరికీ అందేందుకు కృషిచేస్తానని, పేద కుటుంబాలకు ఉచిత న్యాయాన్ని అందిస్తానని, అందరికి నాణ్యమైన గురుకుల విద్యను, కార్పోరేట్ వైద్యాన్ని, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు, ఉపాధి అవకాశాలను కలిస్తానని, అందుకే లక్ష్మీపురం వరంగల్ తూర్పు నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నానని, తన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.