సుక్కా.... ముక్కా!...

 


ఎన్నికల్లో మద్యం, మాంసమే ప్రధానం

కార్యకర్తలను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు

శ్రేణులు చేయిజారిపోకుండా ప్రయత్నం

ప్పటికే రహస్య ప్రదేశాలకు భారీగా చేరిన 'మందు'!

పెరుగుతున్న చికెన్‌, మటన్‌ విక్రయాలు

నల్లగొండ:ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేం దుకు అభ్యర్థులు బారులు కడుతున్నారు. తెల్లవారగానే ఇళ్ల ముందు వాలిపోతున్నారు. తనకు ఓటు వేయాలంటూ గల్లీ గల్లీ తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు. అయితే.. ఈ ప్రక్రియలో కార్యకర్తలదే ప్రధాన పాత్ర. వారి లేనిదే అభ్యర్థులు ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అభ్యర్థుల్లో అత్యధికులు కార్యకర్తల ద్వారానే ఓటర్లను కలుసుకోగలుగుతున్నారు. మరోపక్క వారు చేజారకుండా జాగ్రత్తలూ పాటిస్తున్నారు. కార్యకర్తలకు కావాల్సిన సరంజామాను సమకూర్చుతున్నారు. ముఖ్యంగా మందు, విందులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. మద్యం, బిర్యానీలతో కార్యకర్తల కడుపు నింపుతూ తమ వెంట తిప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. రెస్టారెంట్లు, హోటళ్లు కళకళలాడుతున్నాయి. కార్యకర్తల కోసం ఆయా పార్టీల అభ్యర్థులు ఇప్పటికే భారీగా మద్యాన్ని నిల్వ చేసినట్టు సమాచారం. రహస్య ప్రదేశాల్లో చేరవేసి వారికి అందిస్తున్నట్టు తెలుస్తోంది. 

కార్యకర్తల ద్వారా ప్రలోభాలు

ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో పలు పార్టీల అభ్యర్థులు కార్యకర్తల ద్వారా ఓటర్లను ప్రసస్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఓటర్లకు డబ్బులు, మద్యంతోపాటు విలువైన వస్తువులు పంపిణీకి తెరతీశారని తెలుస్తోంది. ఉదయం ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలను గ్రూపులుగా విడిదీసి ఎవరి వాటా మద్యాన్ని వారికి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దీంతో రాత్రి వేళల్లో సైతం ఎన్నికల వాతావారణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితితే నెలకొంది.

సరపడా మద్యం దిగుమతి!

ఎన్నికలు ఏవైనా అభ్యర్థులు డబ్బు, మద్యం పంచడం పరిపాటి. ఎన్నికల్లో కూడా ఓటర్లకు మద్యాన్ని అందించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు అంచనాలకు అనుగుణంగా మద్యాన్ని దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రంతోపాటు వివిధ మండల కేంద్రాల్లో తమ నమ్మకస్తులతో రహస్య ప్రదేశాల్లో దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు పెద్ద మొత్తంలో మద్యాన్ని నిల్వ చేసుకున్నట్టు తెలిసింది. ఓటింగ్‌కు ఒక రోజు ముందు మద్యాన్ని పంపిణీ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకొని సిద్ధంగా ఉన్నారని సమాచారం. అయితే.. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్న పోలీసులు మాత్రం నిల్వ ఉంచిన మద్యాన్ని పసిగట్టలేక పోతున్నారనే విమర్శలు వ్యక్తమవు తున్నాయి.

పెరిగిన మాంసం విక్రయాలు

ఎన్నికల నేపథ్యంలో మాంసం విక్రయాలు జోరం దుకున్నాయి. రోజురోజుకూ చికెన్‌, మటన్‌ అమ్మకాలు పెరుగుతుండటంతో వ్యాపారుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు, ఓటర్లకు మద్యంతోపాటు సాయంకాలం వేళ మంచింగ్‌కి చికెన్‌ సైతం అందజేస్తున్నట్లు తెలిసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో 62 చికెన్‌ సెంటర్లు ఉండగా సాధారణ రోజుల్లో రోజుకు 4 నుంచి 5 క్వింటాళ్ల విక్రయం జరిగేది. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఒక్క రోజే 9 నుంచి 10 క్వింటాళ్ల అమ్మకాలు జరుగుతున్నట్లు వ్యాపారులు వెల్లడించారు. రోజుకు సుమారు 6 క్వింటాళ్ల మటన్‌ విక్రయాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికల కోలాహలం ఊపందుకోవడంతో మందు, మాంసానికి బాగా గిరాకీ పెరిగింది.